లాక్ డౌన్ కారణంగా ఎక్కడి ప్రజలు అక్కడ ఉండిపోయారు. ప్రజా రవాణా లేకపోవడంతో కొందరు సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్నారు. మరికొందరు రిస్క్ చేసి సొంత వాహనాలపై సొంతిల్లు చేరుకుంటున్నారు. తాజాగా ఓ యువ జంట ఏడు నెలల బిడ్డతో కలిసి బైక్ మీద పుణే నుంచి 670 కి.మీ. దూరం 12 గంటలలో ప్రయాణించి గద్వాల జిల్లాలోని తమ సొంతూరు చేరుకుంది.

కొత్తపల్లి తండాకు చెందిన విశాల్, లీలాబాయి దంపతులు పుణె నగరానికి వలస వెళ్లారు. లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోయారు. లాక్ డౌన్ కొన్ని రోజులే కదా అక్కడే ఉందాం అనుకున్నారు. కానీ, మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని ఇటీవల ప్రధాని మోదీ తెలిపిన సంగతి తెల్సిందే. దీంతో మంగళవారం రాత్రి 10 గంటలకు పూణె నుంచి బయల్దేరి బుధవారం ఉదయం 10 గంటలకు సొంతూరు చేరుకున్నారు. వాళ్లను 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.