కర్ణాటకలో తాను సాగు చేసిన అరటిపండ్లు అమ్ముడుపోలేదని చెత్తకుప్పలో పారేయకుండా, వాటిని శ్రద్ధగా ఎండబెట్టాడు. అరటి పండ్లను పోషకాలు నిండిన డ్రైఫ్రూట్​గా మార్చేసి లాభాలు ఆర్జిస్తున్నాడు. డ్రైఫ్రూట్స్​ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో వైద్యులు చెబుతూనే ఉంటారు. అయితే ఇన్నాళ్లు ఎండు ద్రాక్ష, ఎండిన అప్రికాట్​, ఎండబెట్టిన అంజీరా, కాజూ, బాదం.. ఇలా డ్రైఫ్రూట్స్​లో చాలా రకాలే తిని ఉంటాం. కానీ, ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తవుతున్న ఎండు అరటిపండును ఈ జాబితాలోకి చేర్చేశాడు కర్ణాటకకు చెందిన ఓ రైతు.

కష్టం నుంచి ఆలోచన:

బళ్లారి, కంపిలి తాలూకా, రామసాగర గ్రామానికి చెందిన K.గంగాధర్​ ఓసాధారణరైతు. లాక్​డౌన్ వేళ సుగంధి రకం అరటిని సాగు చేశాడు గంగాధర్​. కానీ, కరోనా కారణంగా మార్కెట్​ పడిపోయి గిట్టుబాటు ధర రాలేదు. దీంతో పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డాడు​. కానీ, మనిషి తలచుకుంటే ఎంతటి విపత్తులోనైనా ఓ మార్గాన్ని వెతకొచ్చని గుర్తించాడు. వెంటనే, అరటిపళ్లు పాడవ్వకుండా వాటిని ఏం చేయొచ్చని ఆలోచించాడు. విదేశాల్లో ఎండు అరటిపండ్లకున్న డిమాండ్​ గురించి తెలుసుకున్నాడు గంగాధర్. భారత్​లో తనలాంటి రైతులను సంప్రదించాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో.. నెల రోజులకు పైగా అరటి పండ్లను ఎండబెట్టి ఓ డబ్బాలో ప్యాక్​ చేసి జిల్లాలోని హోల్​సేస్​, రిటైల్​ దుకాణాలకు విక్రయించి లాభాలు పొందుతున్నాడు. ఎండబెట్టిన అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని. ఈ డ్రైఫ్రూట్​ను తింటే ఆరోగ్యానికెన్నో లాభాలున్నాయని రాయ్​చూర్​ వ్యవసాయ వర్సిటీ ధ్రువీకరించింది. దీంతో ప్రభుత్వం సహకరిస్తే ఈ డ్రై బనానా ఉత్పత్తిని మరింత
వృద్ధి చేస్తానంటున్నాడు గంగాధర్​.