జీహెచ్‌ఎంసీ విధించిన జరిమానాపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కార్యకర్తలు తెలియక నెక్లెస్‌ రోడ్డులో కటౌట్ ఏర్పాటు చేశారన్నారు. కార్యకర్తలకు జీహెచ్‌ఎంసీ రూల్స్ తెలియవని చెప్పారు. జీహెచ్‌ఎంసీ మాత్రం వారి రూల్స్ ప్రకారం ఫైన్ విధించారని పేర్కొన్నారు. తెలియకనే తప్పు జరిగిందని వివరణ ఇచ్చారు. బాధ్యతగా జీహెచ్ఎంసీకి ఫైన్ కట్టేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు.

ఫైన్ ఇందుకే:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి-17న 66వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఫిబ్రవరి-17న జన్మదినం కావడంతో నేతలు, కార్యకర్తలు వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ నగరంలో ఓ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ‘వుయ్ లవ్ కేసీఆర్’ అంటూ పెద్ద కటౌట్‌లో పెద్ద అక్షరాలతో రాసి ఉంది. ఇందులో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, తలసాని ఫొటోలు ఉన్నాయి.

రూ. 5వేలు జరిమానా :

ఈ విషయం జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి రావడంతో.. తలసానికి జరిమానా విధించారు. అనుమతి లేకుండా కటౌట్‌లు ఏర్పాటు చేశారని.. రూ.5 వేలు జరిమానా చెల్లించాలంటూ మంత్రి తలసానికి జీహెచ్‌ఎంసీ నోటీసులు పంపించింది. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు..