తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి నేతగా ముద్రపడిపోయారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ పార్టీలో కొత్త వివాదం క్రియేట్ చేశారు. కొద్దిరోజుల క్రితం జగ్గారెడ్డి వ్యవహారశైలిలో కాంగ్రెస్‌లో తీవ్రమైన చర్చ జరిగింది. అయితే తన అసంతృప్తిని కొంతకాలం ఫుల్ స్టాప్ పెట్టిన జగ్గారెడ్డి, సంక్రాంతి తరువాత కాంగ్రెస్ హైకమాండ్‌ను కలుస్తానని ప్రకటించారు. ఆయన నిజంగానే అలాంటి ప్రయత్నం చేస్తారా ? లేక సైలెంట్‌గా ఉంటారా ? అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. అయితే కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి చర్చ ఆ పార్టీ నేతలతో పాటు ఓ టీఆర్ఎస్ నేతకు కూడా ఇబ్బందిగా మారిందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఆ టీఆర్ఎస్ నేత మరెవరో కాదు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున సంగారెడ్డి నుంచి గెలుపొందిన చింతా ప్రభాకర్ 2018 ఎన్నికల్లో మాత్రం జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి టీఆర్ఎస్‌తో కాస్త సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది.

ఇటీవల కాలంలో జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. ఒకవేళ జగ్గారెడ్డి నిజంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే, ఆయన టీఆర్ఎస్‌లో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పలువురు లెక్కలు వేసుకుంటున్నారు. ఇటీవల కేటీఆర్‌తో ఓ సందర్భంగా జగ్గారెడ్డి ముచ్చటించడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి జగ్గారెడ్డి రాజకీయాలు ఎవరికీ ఓ పట్టాన అర్థంకావడం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ జగ్గారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ హోదా ఉన్నప్పటికీ ఆయన పార్టీ వ్యవహారాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు.

సంగారెడ్డి దాటి బయటకు రావడం లేదు, దీనికి తోడు అప్పుడప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం అందులోనూ రేవంత్ రెడ్డి కేంద్రంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లేందుకే ఆయన ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారనే ఊహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. కానీ జగ్గారెడ్డి మాత్రం తాను పార్టీ మారబోనని చెబుతూ వచ్చారు. ఒకవేళ తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా ఇండిపెండెంట్ సభ్యుడిగా కొనసాగుతానని చెప్పినట్టు కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే నిజంగానే జగ్గారెడ్డి గుడ్ బై చెబితే ఆయన బీజేపీలోకి వెళతారా లేక టీఆర్ఎస్ వైపు వస్తారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ జగ్గారెడ్డి టీఆర్ఎస్‌లోకి వస్తే అది తన రాజకీయ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సంగారెడ్డి టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి జగ్గారెడ్డి వ్యవహారం కాంగ్రెస్ నేతలతో పాటు టీఆర్ఎస్ నేతను కూడా టెన్షన్ పెడుతున్నట్టు కనిపిస్తోంది.