తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన తహసీల్దార్ కార్యాలయంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు. ఈ క్రమంలో తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు రెవెన్యూ సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.

దుండగుడు ఈ ఘటనకు పాల్పడిన అనంతరం తనపై కూడా కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గాయపడ్డ సిబ్బందిని హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుండగుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

లంచ్ టైంలో వచ్చి ! నిప్పంటించి ! పరార్:

లంచ్ టైంలో జనం తక్కువ ఉన్న టైంను దుండగుడు ఎంచుకున్నాడు. పెట్రోల్ ను సంచిలో తెచ్చుకున్నట్లు అక్కడున్నవాళ్లు చెబుతున్నారు. జనం తక్కువగా ఉండటంతో దుండగుడి పని ఈజీ అయ్యింది. నేరుగా తహశీల్దార్ రూంలోకి వెళ్లి వెళ్లగానే పెట్రోల్ ఆమెపై పోసి వెంటనే నిప్పంటించి, పరారయ్యాడు. అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై తహశీల్దార్ ను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే విజయ శరీరం మొత్తం కాలిపోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్లలో ఒకరికి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.