నటి మీరా చోప్రాపై అసభ్య కామెంట్లు.!

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ లో అసభ్య సందేశాలతో తనని వేధిస్తున్నారని నటి మీరా చోప్రా సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల మీరా చోప్రా ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్‌ ‘ఎన్టీఆర్‌ గురించి ఏమైనా చెప్పండి?’ అని ప్రశ్నించాడు. ‘నాకు ఆయన గురించి తెలియదు. ఎందుకంటే నేను ఆయన అభిమానిని కాదు’ అని మీరా సమాధానమిచ్చింది.

మీరా ఇచ్చిన సమాధానంతో అసహనానికి గురైన కొందరు నెటిజన్లు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ ట్వీట్లు పెట్టారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌ వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై మీరా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వారేనా మీ ఫ్యాన్స్ అంటూ నేరుగా ఎన్టీఆర్ పేరుతో ట్వీట్ వేశారు. ‘ఎన్టీఆర్‌.. మీకంటే ఎక్కువగా మహేశ్‌ బాబుని అభిమానిస్తున్నానని చెప్పినందుకు మీ అభిమానులు నన్ను వేధిస్తున్నారు. ఇలాంటి అభిమానులు ఉంటే విజయం వరిస్తుందని మీరు భావిస్తున్నారా?’ అని మీరా ప్రశ్నించారు. ఆ తర్వాత హైదరాబాద్ పోలీసులకు ట్విట్టర్ ద్వారానే కంప్లయింట్ ఇచ్చారు మీరా చోప్రా.