తెలంగాణలో నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో నిర్మాణాత్మక ప్రగతికి వరంగల్‌ చిరునామా అవుతుందని, ఔటర్‌ రింగ్‌రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు సహా వరంగల్‌ మాస్టర్‌ప్లాన్‌కు త్వరలో ఆమోదం లభించనున్నదని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. వరంగల్‌లో క్రెడాయ్‌ రెండురోజుల ప్రాపర్టీషోను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ:

ప్రభుత్వం తీసుకున్న చర్యలతో వరంగల్‌లో రియల్‌ ఏస్టేట్‌, భవన నిర్మాణ రంగాల భవిష్యత్తు అద్భుతంగా మారుతుందని చెప్పారు. ఇప్పటికే విద్యా కేంద్రంగా, ఐటీ హబ్‌గా రూపుదిద్దుకొంటున్న వరంగల్‌లో క్రెడాయ్‌ ప్రాపర్టీషోను నిర్వహించడం సంతోషాన్ని వ్యక్తం చేశారు. వరంగల్‌ వాసులతోపాటు చుట్టుపక్కల జిల్లాల వారికి కూడా ఈ ప్రాపర్టీషో ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్‌, వొడితెల సతీశ్‌కుమార్‌, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి పేర్కొన్నారు. క్రెడాయ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ:

వరంగల్‌లో తాము ప్రాపర్టీషో నిర్వహించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నదన్నారు. దేశ ఆర్థిక రాజధానిగా భాసిల్లుతున్న ముంబై మాదిరిగా రాష్ట్రంలో వరంగల్‌ ఎదుగుతుందన్నారు. క్రెడాయ్‌ రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్‌సాగర్‌రెడ్డి మాటాడుతూ: హైదరాబాద్‌కు చేరువలో ఉండటంతోపాటు కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును, రైల్వే, రోడ్డు కనెక్టివిటీని కలిగివున్న వరంగల్‌ త్వరలోనే పారిశ్రామిక హబ్‌గా మారుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో క్రెడాయ్‌ వరంగల్‌ అధ్యక్షుడు శరత్‌బాబు, ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి తదిరుతలు పాల్గొన్నారు. తొలిరోజే దాదాపు 20 వేలమంది ఈ ప్రాపర్టీషోను సందర్శించారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు కుడా పరిధిలోని లేఅవుట్‌ ప్లాట్లు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, అపార్ట్‌మెంట్లు, విల్లాలకు సంబంధించిన వివరాల గురించి ఆయా నిర్మాణ సంస్థలు, బ్యాంక్‌ అధికారులను ఆరా తీశారు. దీంతో ఈ ప్రాపర్టీషో విజయవంతమైందని నిర్వాహకులు పేర్కొన్నారు.