ఆర్ టీ సీ యూనియన్ సమ్మె ప్రజలను ఇబ్బంది పెడుతోందన్నారు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆర్ టి సి ని ప్రభుత్వం లో విలీనం చేస్తాం అని మ్యానిఫెస్టోలో లో చెప్పలేదన్నారు ఎర్రబెల్లి. యూనియన్ నాయకులు ప్రతిపక్షాల వలలో పడ్డారనీ.. ఆర్ టి సి కార్మికులు 25 శాతం ఫిట్ మెంట్ అడిగితే 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. ఏ రాష్ట్రం లో కూడా ఇంత ఫిట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు.

బిజెపి, కాంగ్రెస్ లు ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఆర్ టి సి ని బాగు చేయాలని ముఖ్యమంత్రి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ , బీజేపీ నేతలు ఆర్ టి సి ప్రైవేట్ చేస్తున్నారు అని కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు ఎర్రబెల్లి. కాంగ్రెస్ , టీడీపీ ప్రభుత్వాలు గతంలో ఆర్ టి సి కార్మికుల బ్రతుకులు ఎందుకు పట్టించుకోలేదో చెప్పాలన్నారు. డ్రామాలు ఇప్పటికైనా మానుకొంటే మంచిదని హితవు పలికారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఆర్ టి సి ని విలీనం చేయడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును, మిషన్ భగీరథను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేశాయన్నారు. కేంద్రం నుండి రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ కోసం ఏం తీసుకొని వచ్చారో ఒక్కటి చెప్పాలన్నారు. ఎవరు అడ్డుపడ్డా ఆర్ టీ సీ ని లాభాల్లోకి తీసుకొని వస్తామన్నారు ఎర్రబెల్లి. ఏపీలో కమిటీ మాత్రమే వేశారనీ.. ఇంకా విలీనం చేయలేదని అన్నారు మంత్రి.