ఇతర పార్టీ నేతల చేరికలతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓవర్ లోడ్ అయింది. దీంతో ఏర్పడుతున్న అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రోజు రోజుకూ అధికార పార్టీలో పెరిగిపోతున్న అసమ్మతి రాగాలు అధినేత కేసీఆర్‌కు కొత్త తలనొప్పిగా మారుతుందనే టాక్ వినిపిస్తోంది. ఓ వైపు మునుగోడు ఉప ఎన్నిక మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ దూకుడుతో సీఎం కేసీఆర్ సతమతం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కారు పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు చేసిన చేసిన కామెంట్స్ టీఆర్ఎస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీరి మాటల వెనుక ఉన్న పరమార్థం ఏంటో తెలియక అధికార పార్టీ నేతలు డైలామాలో పడినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ నేతల వ్యాఖ్యలు అధినేత కేసీఆర్‌కు గులాబీ కింద ముళ్లల గుచ్చుకుంటున్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

తొందర వద్దు ! త్వరలోనే మంచి కాలం:

ఖమ్మం టీఆర్ఎస్‌లో చాలా కాలంగా వర్గపోరు గుప్పుమంటోంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం కూడా చాలా కాలంగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఆయన ఖండిస్తూ వస్తున్నా ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. తాజాగా ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన అనుచరులు ఎవరూ తొందర పడవద్దని, త్వరలో భగవంతుడే మంచి మార్గం చూపిస్తాడని ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఆదివారం జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో ఆయన చేసిన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన అనుచరులతో మాట్లాడుతూ శీనన్న ఇంకేంటి అనే ఉత్కంఠ ఎవరికి వద్దని అలాగే మీ వెంట నడిచే వారిలోనూ ఇలాంటి ఉత్కంఠలే తీసుకురావొద్దని సూచించారు. కాలం, సందర్భం అన్ని ఆ భగవంతుడే నిర్ణయిస్తాడని మనం ఉరికి ఉరికి బోర్లపడాల్సిన పని లేదన్నారు. మీ గుండెల్లో మంచి స్థానం ఇచ్చిన ఆ భగవంతుడే మనందరికీ మంచి మార్గం చూపిస్తాడని త్వరలోనే మంచి ఫలితం రానుందని ఇందులో తనను నమ్ముకున్న వారందరికీ వాటా ఉంటుందని అన్నారు.

పొంగులేటి మాటల వెనుక గూఢార్థం ఏంటనేది టీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. పొంగులేటి కూతురు వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి అధికార పార్టీ నేతల కంటే బీజేపీ నేతలే ఎక్కువగా హాజరయ్యారనే టాక్ వినిపిస్తోంది. తన కూతురు మ్యారేజ్ తర్వాత ఆయన తిరిగి పాలిటిక్స్‌లో మరింత యాక్టీవ్ అయిపోయారు. ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ పొంగులేటికి ఆశ చూపి మోసం చేశారని అందువల్ల అనువైన సమయం చూసుకుని పార్టీ మారేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాను పార్టీ మారడం లేదని చెబుతూనే త్వరలో మంచి కాలం వస్తుందని కామెంట్స్ చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమై ఉంటుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.