తెలంగాణ నుంచి తిరుమలకు భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ ప్రకటించింది. తెలంగాణ నుంచి రోజుకు వెయ్యి మందికి రూ.300 దర్శన టికెట్లు జారీ చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ టీఎస్ఆర్టీసీ మధ్య అంగీకారం కుదిరింది. తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఆర్టీసీ బస్‌ టికెట్‌తో పాటే తిరుమల దర్శన టోకెన్‌ కూడా పొందే వీలు కల్పించింది టీఎస్ఆర్టీసీ. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ, తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) మధ్య అంగీకారం కుదిరింది. ప్రతిరోజూ వెయ్యి రూ.300 దర్శన టికెట్లను టీటీడీ తెలంగాణ ఆర్టీసీ (TSRTC) కి కేటాయించనుంది. ప్రయాణానికి రెండ్రోజుల ముందుగా ఈ దర్శన టికెట్లను టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ లేదా అధీకృత డీలర్‌ ద్వారా రిజర్వు చేసుకోవాలి. అయితే బస్‌ టికెట్‌తోపాటే దర్శన టికెట్‌నూ బుక్‌ చేసుకోవాలి.

వేర్వేరుగా వాటిని రిజర్వు చేసుకునే వీలుండదు. TSRTC ఇటు ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) బస్సుల్లో ఇప్పటికే టీటీడీ టికెట్లు పొందే వీలుంది. సర్వీస్‌ చార్జీపై నిర్ణయం తీసుకుని సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాక టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభించే తేదీని వెల్లడించనున్నట్టు టీఎస్‌ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ శనివారం ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశం కల్పించినందుకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.